టాలీవుడ్ కొత్త జంటకు రఘురామ విందు.. వైరల్ అవుతున్న‌ ఫొటోలు!

  • ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు విందుకు హాజరైన విజయ్, రష్మిక
  • విందు ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న రఘురామ
  • సొంత గ్రామంలో విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించిన విజయ్ దేవరకొండ
టాలీవుడ్ కొత్త జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇచ్చిన విందుకు హాజరైంది. రఘురామకృష్ణరాజు స్వయంగా విజయ్, రష్మికలను తమ కుటుంబ సభ్యులతో కలిసి డిన్నర్‌కు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అనంతరం వారితో దిగిన ఫొటోలను ఆయన తన 'ఎక్స్‌' (ట్విట్టర్) ఖాతాలో పంచుకున్నారు. "ఈ సాయంత్రం ప్రముఖ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలకు వారి కుటుంబ సభ్యులతో పాటు మా ఇంట్లో ఆతిథ్యం ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. అద్భుతమైన వ్యక్తులతో సరదాగా మాట్లాడటం, వారితో గడిపిన సమయం మరపురానిది" అంటూ ఆయన ట్వీట్ చేశారు. రఘురామ ట్వీట్‌కు రష్మిక కూడా స్పందిస్తూ.. "మాకు ఆతిథ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు సర్, ఇది ఒక అద్భుతమైన సాయంత్రం" అని బదులిచ్చారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరోవైపు విజయ్ దేవరకొండ తన సేవాగుణాన్ని చాటుకున్నారు. తన సొంత జిల్లా అయిన నాగర్ కర్నూలు జిల్లాలోని బల్మూర్ మండలం తుమ్మనపేటలో 'ది విజయ్ దేవరకొండ ఫౌండేషన్' తరఫున విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా హాజరుకావడం విశేషం. వీరితో పాటు స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలోని 45 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కనబరిచిన 181 మంది విద్యార్థులకు వారు చెక్కులను అందజేశారు. ఫస్ట్ ర్యాంకు సాధించిన వారికి రూ. 10,000, సెకండ్ ర్యాంకు సాధించిన వారికి రూ. 5,000 చొప్పున ఆర్థిక సాయం అందించారు.

ఒకవైపు రాజకీయ ప్రముఖులతో విందు, మరోవైపు సొంత ఊరిలో సేవా కార్యక్రమం.. ఇలా రెండు భిన్నమైన సందర్భాల్లోనూ విజయ్, రష్మిక జంటగా కనిపించడం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Vijay Deverakonda
Rashmika Mandanna
Raghu Rama Krishna Raju
Vijay Deverakonda Foundation
Nagarkurnool scholarships
Tollywood news

More Telugu News